MARCH 20, 2021
పోలీస్ కధనం ప్రకారం :
- మదనపల్లె పోలీస్ ప్రైమా ఫేసి రిపోర్ట్ ప్రకారం, జనవరి 24వ తారీఖున తమ ఇద్దరి సొంత బిడ్డలను వారి తల్లిదండ్రులు తమ స్వగృహంలో హత్య చేసారని పత్రికా సమావేశంలో తెలియచేసారు[1]. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు మరియు నేరస్థుల సాక్షం మేరకు, ఈ హత్య వెనకాల మూఢవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం[2].
- మన దేశంలో ఇలాంటి సంఘటన ఇది మొదటిదికాదు, చివరిది కూడా కాబోదేమో. ఆ విషయానికి వస్తే ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఈనాటికి కూడా నమోదుకావడం, యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంగం వీటిని ధ్రువీకరించడం, స్పందించడం తరచుగా జరుగుతున్నది[3].
ఇలాంటి ఘటనలు మరియు మన దేశం లో కొన్ని చట్టాలు:
- మదనపల్లె లాంటి ఘటనలు మన సమాజంలో చాలా ఏళ్ళ నుండి జరుగుతున్నవే. ఉదాహరణకు నరబలి, జంతుబలి, పిల్లల జననేంద్రియ విభాగాలను కత్తిరించడం, ఆడశిశువులను బలివ్వడం లాంటి మూఢవిశ్వాసాలు తరుచుగా మనం వింటూనే ఉంటాం. ఈ సంఘటనల వెనకాల ముఖ్య ఉదేశం దేవుడి కోపాన్ని తగ్గించడానికో, లేదా మరో జన్మలో దేవుడుకి దగ్గరాగా ఉండచ్చనొ వంటి మూఢ విశ్వాసాలు. సమాజంలో తరచుగా మహిళలు ఇలాంటి నమ్మకాల ద్వారా ఎక్కువ శాతం బాధితులుగా ఉండడం జారుతూగుతూ ఉంటుంది. చేతబడి[4], భూత వైద్యం, స్వస్థత ఆయిల్, ఊరు మంత్రగత్తెలు, అగోరాలు, క్షుద్ర పూజలు మొదలైన మూఢవిశ్వాసాలు మన సమాజంలో చెప్పుకో దగ్గ మూఢ విశ్వాసాలు[5] .
మూఢ నమ్మకాలను నిర్ములించే దిశగా మన దేశంలో చట్టాలు:
- బీహార్ లో కొన్ని గ్రామాల్లో మంత్రగత్తెలని చాలా మంది మహిళలను ఆ గ్రామ ప్రజలే చంపిన సంఘటనల దృష్ట్యా (witch hunting), 1999 లో బీహార్లో మొట్టమొదటి సారిగా witch hunting లాంటి మూఢవిశ్వాసాలను నిరోదిస్తూ ఒక్క witch hunting నిరోధక చట్టం అమలు పరిచారు [6]. ఇది ఒకందుకు సంతోషించదగ్గ పరిణామమే అయినా ఈ చట్టం చాలా మూఢనమ్మకాలను పరిగణంలోకి తీసుకోలేదు. క్రమేపి ఈ witch hunting నిరోధక చట్టంను అస్సాం, జార్ఖండ్ మరియు కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో అమలుపరిచారు[7].
- మన దేశంలో ఉన్న మూఢనమ్మకాల చట్టాలు సరిపోవు అని, మా ప్రియ మిత్రుడు నరేంద్ర దభోల్కర్[8]దాదాపు 24 సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నం చేసి మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్ములన బిల్ ను డ్రాఫ్ట్ చేసారు. ఆ బిల్ 2007 లో డ్రాఫ్టు చేసినా సుమారు చాలా సంవత్సరాలు ఈ బిల్ మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందని అసెంబ్లీలో దానిని చట్టంగా రూపాంతరం చెందనివ్వలేదు. ఈ బిల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం 2013 అసెంబ్లీలో తీర్మానం చేసి Prevention & Eradication of Human Sacrifice & Other Inhuman, Evil & AghoriI Practices & Black Magic Act,2013[9] చట్టాన్ని చేసింది.
- దురదృష్టం ఏంటంటే, ఈ బిల్ మహారాష్ట్రలో చట్టంగా రూపాంతరం చెందింది కేవలం మా మిత్రుడు దబోల్కర్ దారుణ హత్య తరువాతే. తన జీవితకాల పోరాట ఫలితమే ఈ మూఢవిశ్వాస వ్యతిరేక చట్టం.ఈ బిల్ ను క్రమేపి కొన్ని మార్పులు చేర్పులు చేసి కర్ణాటకలో చట్టం తెచ్చింది అక్కడ ప్రభుత్వం[10]. ఈ చట్టాలను కఠినతరం చేయవలసిన అవసరం ఇంకా చాలా ఉంది.
మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మన రాష్ట్రంలో ఉందా? :
- దురదృష్టం ఏంటి అంటే ఈ మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం మన రాష్ట్రంలో లేదు. మదనపల్లెలో జరిగిన ఈ సంఘటనలోని నిందితులను IPC 302 చట్టం కింద అరెస్ట్ చేసారు[11]. కానీ ఈ IPC చట్టాలు ఒక్క హత్య జరిగినతరువాత నిందితులకు శిక్షకు పనికి వస్తాయి గాని, హత్య జరగకుండా ఆపలేవు.
- అదేగనక ఈ మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం మన రాష్ట్రంలో ఉండి ఉంటె, కొంత అనుమానం పోలీసులకు వచ్చినా ముందస్తు జాగ్రత్తలు, మరియు అరెస్టులు చేయడానికి ఆస్కారం ఉండేది. అందుకని ఇలాంటి చట్టాల అవసరం మన రాష్ట్రంలో ఉంది[12].
ఈ మూఢనమ్మకాల చట్టాలు సరిపోతాయా?
- తప్పకుండా ఈ మూఢవిశ్వాసాల నిర్మూలన చట్టాలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొంతవరకు సరిపోతాయి. కానీ ఈ సంఘటనను మనం ఇంకా కొంచెం లోతుగా విశ్లేషించాలని నా భావన.
- మూఢవిశ్వాసాల పేరుమీద ఈ హత్య జరిగింది స్వయానా ఒక్క పెద్ద విద్యావంతుల కుటుంబంలో. కెమిస్ట్రీలో పీహెచ్డీ, మాథెమాటిక్స్ లో లెక్చరర్, పిల్లలు ఉన్నత విద్యావంతుల కుటుంబం. మరి వారికి ఇంతటి మూఢవిశ్వాసం ఎలా మదిలోకి వెళ్ళింది. కన్న కూతుర్లను బలివ్వడం, మళ్ళీ బతుకుతారు అని నమ్మేదాకా వెళ్లారంటే, ఒక్క సమాజంగా మనం దీనిని లోతుగా విశ్లేషించాల్సిందే.
- మూఢనమ్మకాలు పాత భావనలే అయినా, ఈ మధ్య వాటిని టెక్నాలజీ సహాయంతో చదువుకున్న వారికి దగ్గరగా తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందేమో అని నా అనుమానం. పైగా వారిని ఆకర్షించడానికి కొన్ని సూడో సైన్స్ సూత్రాలను కలగలిపి, చెప్పాల్సిన మూఢ భావాలని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది.
- ఉదాహరణకు పునర్జన్మకు సంబందించిన విషయాలను వాస్తవాలుగా చిత్రీకరించి, ఇదే వాస్తవం అని నమ్మబలికె ప్రయత్నం. కొంత ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, యూనివర్సిటీలకు, స్కూళ్లకు వెళ్లి నాలుగు ముక్కలు చెప్పటం. ఇందులో ఒకే మతం అనే లేదు, ఇంగ్లీష్ మాటలతో ప్రజలను అబ్బురపరిచే పాస్టర్లు, గురువులు, ముల్లాలు చాలా మందే ఉన్నారు మన సమాజంలో. వీరితో జాగ్రతగా ఉండవలసిన అవసరం మనకు, మన పిల్లలకు ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పనులు:
- మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనను హేతుబందంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత మరియు బాధ్యత చాలా ఉంది. దీనికి కేవలం ఒక్క మతానికో, వర్గానికో పరిమితి చేయకుండా మన సమాజంలో మూఢ నమ్మకాలూ ఎలా ఏర్పడుతున్నాయో అన్వేషించాలి.
- వెంటనే సామజిక, మానసిక నిపుణులతో ఒక్క కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలి. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమస్య పరిస్కార చర్యలను చేపట్టాలి.
- ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బహిరంగ చర్చ జరపాలి. అందరి సూచనలు తీసుకుని ఒక్క హేతుబద్ధమైన సమాజంగా మన రాష్ట్రాన్ని ముందుకి నడపాలి.
- విద్యావ్యవస్థలో మార్పుల గురించి చర్చ జరగాలి. విద్యార్థులలో, తల్లిదండ్రులలో కొంత మార్కుల వేట తగ్గించి, క్రిటికల్ థింకింగ్ ను ప్రమోట్ చేసే మార్గాలను అన్వేషించాలి.
- ప్రభుత్వం మానసిక వైద్యం మరియు కౌన్సెలింగ్ సెంటర్స్ ను ప్రజలలోకి అందుబాటులోకి తీసుకువచ్చి, మానసిక రోగం మీద కొంత అవగాహనను పెంచాలి.
- మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు, సైన్స్ ఫెస్ట్లు, సైన్స్ ప్రమోషన్ ఆక్టివిటీస్ స్వయంగా నిర్మించాలి
- సామజిక సమస్యలమీద లోతయిన పరిశోధన కోసం సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కోసం నిదులని కేటాయించి, పిల్లలను, శాస్త్రవేత్తలను పరిస్కారమార్గానికి ప్రోత్సహించాలి.
- కఠినమైన మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలను తీసుకురావాలి.
- కొన్ని మీడియాలో మూఢనమ్మకాలను ప్రోత్సహించే విదంగా ప్రోగ్రాములు నిర్వహిస్తూ, సమాజాన్ని అజ్ఞానంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతున్నది. వెంటనే ఇలాంటి మీడియా కధనాలను ప్రభుత్వం నిలిపివేయాలి.
ఇది మన భావితరాల కోసం, మన పిల్లల కోసం, మానవాళి కోసం, వైజ్ఞానిక భారతం కోసం.
********************************************************************
ఈ వ్యాసం విజ్ఞాన దర్శిని వాలంటీర్ ప్రవీణ్ కుమార్ రాసారు.
[1] మా చేతులతో మేమే చంపుకొన్నామే..
[2] Highly educated couple kills daughters with dumbbell over ‘superstitious’ beliefs, says they will come back
[4] అబద్ధాల వేట – నిజాల బాట/చదువుకున్నవారిలోనూ మూఢనమ్మకాలెందుకుంటాయి?
[5] Maharashtra Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013
[6] https://thelawbrigade.com/wp-content/uploads/2019/05/Akshay-Singh-Sangeet.pdf
[7] Contemporary Practices of Witch Hunting: A Report on Social Trends and the Interface with Law
[8] Narendra Dabholkar – Wikipedia
[9] Maharashtra Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013
[10] The anti-black magic and superstition ordinance has been promulgated in Maharashtra
[11] ‘COVID came from Lord Shiva’s hair’: Murder-accused couple baffle police in Andhra Pradesh